ఎన్డీయే గెలుపు.. మోదీ నాయకత్వంపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు

  • వికసిత భారత్ లక్ష్యానికి ఈ ఫలితాలు మరింత బలాన్నిస్తాయన్న చంద్ర‌బాబు
  • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం దేశానికి మంచిదన్న విజయసాయిరెడ్డి
  • చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచన
  • దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన విజయం అనేది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తాజాగా వెలువ‌డుతున్న‌ ఈ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. వికసిత భారత్ నిర్మాణమనే మోదీ దార్శనికతకు ఈ ఫలితాలు మరింత బలాన్నిచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ ‘ఎక్స్’ ఖాతాలో ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

"సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే స్ఫూర్తితో సాగుతున్న ఎన్డీయే, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచింది. అభివృద్ధి పట్ల ఎన్డీయేకున్న నిబద్ధతపై ప్రజలు ఉంచిన నమ్మకం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. విశ్వసనీయత, అభివృద్ధి, ప్రజలతో నిజాయతీగా మమేకమవడానికే యువ భారతదేశం విలువ ఇస్తుందనే సందేశాన్ని ఈ ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చాయి" అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు గెలిచిన అభ్యర్థులు, కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

బెంగాల్‌లో బీజేపీ.. దేశానికి మంచిది: విజయసాయిరెడ్డి
మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ ఫలితాలపై స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం దేశ ప్రయోజనాలకు మంచిదని ఆయన ‘ఎక్స్’ వేదికగా అభిప్రాయపడ్డారు. చొరబాట్లపై కఠినంగా వ్యవహరిస్తామని, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని ఆయన గుర్తుచేశారు. "మన ఆర్థిక వ్యవస్థకు చెదపురుగుల్లా మారిన బంగ్లాదేశీ చొరబాటుదారులను గుర్తించడం, తొలగించడం, తిప్పి పంపడం అనే విధానం అవసరం" అని ఆయన అన్నారు. అలాగే, తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే అరంగేట్రంపై స్పందిస్తూ, దక్షిణాదిలో విశ్వసనీయ ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Chandrababu
Andhra Pradesh
NDA victory
Narendra Modi
West Bengal elections
Assam elections
BJP
TDP
Vijayasai Reddy
Indian Politics

More Telugu News